Breaking News

ఎమ్మెల్యే అండతో ప్రభుత్వ స్థలాలకు ఎసరు – కాదని నిరూపిస్తే దేనికైనా రెడీ‌ – ఆక్రమణలను ఆపకుంటే కలెక్టరేట్ ను ముట్టడిస్తాం : బీజేపీ రాష్ట్ర నాయకులు నందీశ్వర్ గౌడ్

అమీన్ పూర్, సిటీ టైమ్స్: అధికార పార్టీ ఎమ్మెల్యే కనుసన్నల్లోనే భూ కబ్జాలు, ప్రభుత్వ భూముల ఆక్రమణలు జరుగుతున్నా జిల్లా కలెక్టర్, టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని బీజేపీ రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ తీవ్ర స్థాయిలో ధ్బజమెత్తారు. సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలోని బందంకొమ్ములో జరుగుతున్న భూ అక్రమాలు, ప్రభుత్వ స్థలంలో జరుగుతున్న భూ కబ్జాలను స్థానిక నేతలతో కలిసి బీజేపీ రాష్ట్ర నాయకులు నందీశ్వర్ గౌడ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమీన్ పూర్ సర్వే నంబర్ 343లోని 10 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కొందరు ప్రైవేటు వ్యక్తులు కబ్జా చేయాలని ప్రయత్నిస్తున్నారని అన్నారు‌. ఈ కబ్జాల్లో స్థానిక ఎమ్మెల్యే హస్తం ఉందని, ఎమ్మెల్యే కనుసన్నల్లోనే ప్రభుత్వ స్థలాలను, అమాయకుల ప్లాట్లను కబ్జా చేస్తున్నారని మండిపడ్డారు. ఎకరం భూమిని కొనుగోలు చేసి పదెకరాల ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేస్తున్నారని, ప్రభుత్వ స్థలమని సూచిస్తూ ఏర్పాటు చేసిన బోర్డును తొలగించడం హేయమైన చర్య అన్నారు. కుంటలు, చెరువులు, బొందల గడ్డలు ఇలా ఏవి కనబడితే వాటిని ఎమ్మెల్యే, ఆయన అనుచరులు కబ్జాలు చేస్తూ భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారని అన్నారు. వేల కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములను ఎమ్మెల్యే కబ్జా చేస్తున్న విషయం అసత్యమని చెబితే తనపై ఎలాంటి చర్యకైనా సిద్ధమేనని నందీశ్వర్ గౌడ్ సవాల్ విసిరారు. మంత్రులు కేటీఆర్, హరీష్ రావు లు పార్ట్ నర్స్ అని చెప్పుకుంటూ ఎమ్మెల్యే ఇష్టారీతిగా భూ కబ్జాలకు పాల్పడుతూ కోట్లకు పడగలెత్తాడని ధ్వజమెత్తారు. సర్వే నంబర్ 345, 346 పట్టా భూములను‌ కొనుగోలు చేసి దానికి అనుకుని ఉన్న సర్వే నంబర్ 343 లోని పదెకరాల ప్రభుత్వ స్థలంలోని కొండలను, గుట్టలను పిండిచేస్తూ దర్జాగా 300 కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూములను కబ్జా చేయడానికి సిద్ధపడుతున్నారని ఎద్దేవా చేశారు. పానకాల రావు, అనిల్ అనే బిల్డర్లు ఎమ్మెల్యే సహకారంతో యథేచ్ఛగా భూ కబ్జాలకు పాల్పడుతున్నారని అన్నారు. ఇంత జరుగుతున్నా సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హన్మంతరావు పట్టించుకోకపోవడం వెనక పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. జిల్లా కలెక్టర్ వెంటనే‌ స్పందించి డిజిటల్ సర్వే చేయించి కబ్జాలకు గురవుతున్న ప్రభుత్వ స్థలాలకు కంచె ఏర్పాటు చేసి రక్షించాలన్నారు. లేని పక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ను పెద్ద మొత్తంలో ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ఎడ్ల రమేష్, రవీందర్, బాసిత్ అశోక్, రాజశేఖర్ రెడ్డి, రవీందర్, ఆదిలి రవీందర్, బసవరాజు, అరుణ్, తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published.