ఆన్లైన్ వేదికగా మోసాలు..
డబ్బులు కాజేస్తున్న వైనం..
దిల్లీ.. ఘాజియాబాద్.. మొహలీలో కాల్ సెంటర్లు..
ఆస్ట్రేలియా.. యుకె.. సింగపూర్లలోని బాధితులు ఎక్కువ..
దిల్లీకి చెందిన ముగ్గురు.. హైదరాబాద్‌కు చెందిన నలుగురు నిందితులు..
సైబర్ క్రైమ్ పోలీసులకు HDFC బ్యాంక్ ఉద్యోగి ఫిర్యాదు..
అరెస్టు చేసిన పోలీసులు..
సైబరాబాద్, సిటీటైమ్స్: విదేశి వినియోగదారులను మోసం చేస్తూ డబ్బులు దొంగిలిస్తున్న సైబర ముఠాను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పంజాబ్ రాష్ట్రంలోని మొహాలీలో అరెస్టు చేశారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర వివరాలను వెల్లడించారు. ముఠాలోని ప్రధాన నిందితుడు దిల్లీకి చెందిన నవీన్ భుటానీ(41) ఐటీ కంపెనీలకు టెక్నికల్ సేవలను అందిస్తాడు. విదేశి కస్టమర్లకు సేవలను అందించేందుకు 2017లో ఆర్ఎన్ టెక్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను స్థాపించాడు. అనంతరం తన సహాయకుడు మోనుతో కలిసి మూడు కాల్ సెంటర్లను దిల్లీలోని జనక్పూరిలో, ఘజియాబాద్‌లోని కౌసంబి, పంజాబ్‌లోని మొహాలీలో ఏర్పాటు చేశాడు. విదేశి కస్టమర్లను సేవలందించే పేరుతో వారి కాంటాక్ట్ నెంబర్లు సేకరించేవాడు. ఎక్కువగా ఆస్ట్రేలియా, యూకే, సింగపూర్‌కు చెందిన కంపెనీలు సేవల కోసం నవీన్‌ను సంప్రదించేవి. వినియోగదారులకు మూడు విధాలుగా మోసం చేసేవారు. గూగుల్ యాడ్స్ ద్వారా పేపాల్, అమెజాన్, రూటర్, ఇంటర్నెట్ సమస్యలను ఉచితంగా పరిష్కరిస్తామని నవీన్ యాడ్స్ ఇచ్చేవాడు. వాటిని చూసి సంప్రదించే వారికి కాల్ సెంటరులో పనిచేసేవారు మాటలతో నమ్మించి రిమోట్ యాక్సెస్ పొందుతారు. మోహిత్ ఇచ్చిన పేమెంట్ గేట్‌వే లింకును పంపి డబ్బులను కొట్టేస్తారు. నాగరాజు, శ్రీనివాస్‌ల సహకారంతో పేమెంట్ గేట్వేలను మోహిత్ పొందేవాడు. శ్రీనివాస రావు, పవన్ వెన్నెలకంటిల బ్యాంక్ అకౌంట్లను వినియోగించేవారు. వారు తమ కమిషన్ కట్ చేసుకొని మిగిలిన మొత్తాన్ని మోహిత్‌కు పంపేవారు. వీరు మెయిల్స్, ఎస్ఎంఎస్ల ద్వారా కూడా మోసాలకు పాల్పడతారు. విదేశి కస్టమర్ల వివరాలను సేకరించి వారికి కాల్స్ చేసి డబ్బులను కొట్టేసేవారు.
ఈ క్రమంలో హెచ్డిఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ ఇంటెలిజెన్స్ అండ్ కంట్రోల్ యూనిట్లో పనిచేసే అబ్దుల్ నయీంకు ఒక స్వైపింగ్ మెషీనులో అనధికారిక ట్రాన్సాక్షన్లు విదేశి కార్డుల ద్వారా జరిగినట్లు తెలిసింది. 85 రకాల విదేశి కార్డుల సుమారు రూ.64లక్షల లావాదేవీలు జరిగాయని గుర్తించారు. దీంతో అనుమానం వచ్చిన అతను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతని ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు హెల్తీ డెంటల్ క్లీనిక్ పేరిట ఉన్న మెషీన్ ద్వారా లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. క్లోనింగ్ చేసిన కార్డుల ద్వారా డబ్బులను కాజేసినట్లు తెలుసుకున్నారు. పక్కా సమాచారం మేరకు మొహలీలోని కాల్ సెంటరుపై దాడులు నిర్వహించి ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిలో దిల్లీకి చెందిన నవీన్ భుటానీ, మోహిత్, మోను ఉన్నారు. హైదరాబాద్‌కు చెందిన నాగరాజు బొండాడ, దొంతుల శ్రావణ్ కుమార్, సాధనాల ముక్కంటి శ్రీనివాస రావు, పవన్ వెన్నెల కంటి వారు కూడా నిందితులుగా తేలారు. నిందితుల వద్ద నుంచి రూ.1,11,40,000లు, మూడు కార్లు, నాలుగు ల్యాప్‌టాప్‌లు, 12 మొబైల్ ఫోన్స్, 10 సీపీయులు, ఆరు రబ్బర్ స్టాంపులు, 16 చెక్ బుక్కులు, 18 డెబిట్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచి రిమాండుకు తరలించినున్నట్లు సీపీ వెల్లడించారు.