Breaking News

మాస్క్ అండ్ డ్రైవ్..‌

మాస్క్ పెట్టకుంటే రూ. వెయ్యి జరిమానా కట్టుడే
ప్రత్యేక డ్రైవ్ చేపట్టిన చందానగర్ పోలీసులు
వర్తక, వ్యాపార, వాహనదారులకు చలాన్లు

చందానగర్, సిటీటైమ్స్: కరోనా థర్డ్ వేవ్ ముప్పు ముంచుకొస్తుంది..రోజురోజుకూ జీహెచ్ఎంసీ పరిధిలో కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఎలాంటి లాక్ డౌన్ లేకపోవడం, ప్రజలు సైతం తగిన జాగ్రత్తలు పాటించడం మరవడంతో కరోనా విశ్వరూపం చూపుతోంది. కరోనా నివారణకు మాస్క్ తప్పని సరి అని, మాస్క్ ధరించని వారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెయ్యి రూపాయల జరిమానాను సైతం విధించాలని ఇప్పటికే పోలీస్ అధికారులకు, కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఇవన్నీ ఏమి పట్టకుండా ప్రజలు ఎలాంటి కనీస జాగ్రత్తలు పాటించకపోవడంతో పోలీసులు రంగంలోకి దిగారు.

ప్రతి ఒక్కరూ మాస్క్ తప్పనిసరిగా ధరించాలని చెబుతున్నా కొందరు మాట వినడం లేదు..మాస్క్ లు పెట్టుకోకుండానే రోడ్లు ఎక్కుతున్నారు. కరోనా నుంచి రక్షణ పొందేందుకు మాస్క్ తప్పనిసరిగా ధరించాలని వైద్యాధికారులు చెబుతున్నా చాలా మంది పట్టించుకోకుండా నిర్లక్యంగా వ్యవహరిస్తూ కరోనా వ్యాప్తికి కారణమవుతున్నారు. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మాస్క్ ను ధరించడంలో యువత, వర్తక, వ్యాపార సముదాయాల్లో, జన సాంద్రత గల ప్రదేశాలలో చందానగర్ పోలీసులు 2022 జనవరి 2 వ తేదీ నుంచి స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. మాస్క్ ధరించని వారిపై తమదైన శైలిలో కొరడా ఝుళిపిస్తున్నారు. మాస్క్ లేకుండా దుకాణాల వద్ద ఉన్న వారికి, వాహనదారులు, పని చేసే ప్రదేశాల వద్ద, మార్కెట్లలో పోలీసులు మాస్క్ అండ్ డ్రైవ్ చేపట్టి అవగాహన కల్పిస్తున్నారు. మాస్క్ లేని వారిని గుర్తించి వారి ఫోటోలను తీస్తూ ఆన్ లైన్ లో జరిమానా రశీదును అందజేస్తున్నారు. వెయ్యి రూపాయల జరిమానా చెల్లించని వారిలో కోర్టులో ప్రవేశపెట్టి డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్టు కింద వారెంట్ జారీ చేస్తున్నారు. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇప్పటివరకు 300 పై చిలుకు మాస్క్ కేసులు నమోదైనట్లు తెలిసింది.

మాస్క్ లేకుంటే జరిమానా తప్పదు
– క్యాస్ట్రో రెడ్డి, చందానగర్ సర్కిల్‌ ఇన్ స్పెక్టర్
కరోనా మూడో ముప్పు ముంచుకొస్తున్న తరుణంలో ప్రతి ఒక్కరూ తప్పకుండా మాస్క్ ధరించాలి. మాస్క్ ధరించకుంటే తప్పకుండా వెయ్యి రూపాయల జరిమానా విధించడం జరుగుతుంది. జనవరి నెలలో ప్రారంభమైన మాస్క్ స్పెషల్ డ్రైవ్ ఇక నుంచి మరింత కఠినతరం చేయనున్నాం. పోలీస్ స్టేషన్ కు వచ్చే వారు సైతం గుంపులు గుంపులుగా వస్తే అనుమతించేది లేదు. కేవలం ఒక్కరికి మాత్రమే అనుమతి, మహిళల కేసు విషయంలో మహిళతో పాటు మరో వ్యక్తికి పోలీస్ స్టేషన్ లోకి అనుమతి ఉంది. బహిరంగ ప్రదేశాలు, జనావాసాల మధ్య, మార్కెట్లలో, దుకాణాల్లో, హోటళ్ల లో గుంపులుగా ఉండకుండా ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలి.

Leave a Reply

Your email address will not be published.